Skip to main content

చివరి శ్వాస వరకు నటిస్తా

Murali Mohan Talks About TFI Shift
చివరి శ్వాస వరకు నటిస్తా 
– మురళీమోహన్‌

‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు.

అమ్మే నా గురువు
ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుకుంటాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి మంచి వ్యాపారవేత్తగా స్థిరపడాలని కోరిక. దానితో చదువుపై దృష్టి పెట్టలేకపోయాను. చదువులో ఏవరేజ్‌ స్టూడెంట్‌ని. హీరో కృష్ణగారు నేను కలిసి ఇంటర్‌ చదివాం. ఇద్దరం ఫెయిల్‌ అయ్యాం. పియుసితో కృష్ణగారు డిగ్రీకి వెళ్లారు. నేను వ్యాపారం వైపు మళ్లాను.

అమ్మ తరపు, నాన్న తరుఫు కూడా ఆస్తిపరులమే. వ్యాపారంలో నష్టం రావడం, అదే సమయంలో మా సిస్టర్స్‌ ఇద్దరికీ పెళ్లిళ్లు చేయడంతో కాస్త నలిగిపోయాం. వ్యాపారం చేద్దామంటే నా దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏడాదిపాటు ఖాళీగా కూర్చున. మద్రాస్‌ ఆంధ్రా క్లబ్‌లో నాటకాల పోటీలు జరుగుతున్నాయని పేపర్‌లో ప్రకటన చూశా. అక్కడి క్లబ్‌ సెక్రటరీ డైరెక్టర్‌ రామినీడుగారు, చటర్జీగారు మా ఊరి వారే కావడంతో డేర్‌గా వెళ్లిపోయాం. ‘పోలీస్‌’ అనే నాటకం ప్రాక్టీస్‌ మొదలుపెట్టాం. కానీ సెలెక్ట్‌ కాలేదు. మా ఊరి కుర్రాళ్లంతా ‘నువ్వు అందంగా ఉన్నావ్‌, బాగా నటిస్తున్నావ్‌ సినిమాల్లో ట్రై చెయ్యి’ ఎలాగు మద్రాస్‌లో రామినీడు గారున్నారుగా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారు అనడంతో ఆయన దగ్గరకు వెళ్లి అదే మాట చెప్పా. కుర్రాడి వేషాలిద్దామంటే పెద్దోడివి అయిపోయివ్‌, పెద్ద పాత్రలు ఇద్దామంటే పర్సనాలిటీ లేదని చక్రవర్తిగారి దగ్గరకు పంపారు. అప్పటికి ఆయన సంగీత దర్శకుడు కాలేదు. నా వాయిస్‌ టెస్ట్‌ చేయించి నీ వాయిస్‌ పీలగా ఉంది. రోజూ ఓ చుట్ట తాగు.. అప్పుడే వాయిస్‌లో బేస్‌ వస్తాది. ఈలోపు ఓ మూడునాలుగేళ్లల్లో బాడీ బిల్డ్‌ చేసుకుని మంచి వాయిస్‌తో రా.. అని పంపేశారు. 
వంద జీతానికి...
మా చిన్నాన్న విజయవాడలో కొత్తగా పెట్టిన వ్యాపారానికి వర్కింగ్‌ పార్టనర్‌గా చేరా. నెలకి రూ.100 జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. 1963 నుంచి పదేళ్లపాటు ఆ వ్యాపారంలో ఉండి బాగా అభివృద్ధి చేశా.  కోట్లు సంపాదించే వ్యాపారస్తుల మధ్య నేనూ నిలబడగలిగా. ఆ వ్యాపారం చేస్తుండగా పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. 
ఊహించని అవకాశం...
అదే సమయంలో మేకప్‌ టెస్ట్‌ కోసం మద్రాస్‌ రమ్మని ఫోన్‌ వచ్చింది. హనుమాన్‌ ప్రసాద్‌ ఎంకరేజ్‌ చేసి పంపారు. కె.ఎస్‌ ప్రకాశరావుగారు మేకప్‌ టెస్ట్‌ చేయించారు. శోభన్‌బాబు కథానాయకుడిగా రాంనీడుగారి దర్శకత్వంలో ‘ఇదా లోకం’ సినిమాకు నన్ను సెకెండ్‌ హీరోగా తీసుకున్నారు. నా పోర్షన్‌కి నెల రోజులు గ్యాప్‌ ఉంది. రెండు నెలలు గడిచాయి కానీ ఫోన్‌ 
రాలేదు. కొత్త ఆర్టిస్ట్‌ వద్దని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేయడంతో ఆ పాత్రను చంద్రమోహన్‌తో చేయించారు. దానికి నేనేమీ బాధపడలేదు. ఓరోజు అట్లూరి పూర్ణచంద్రరావుగారు పిలిపించారు. ఓ డైలాగ్‌ చెప్పమనిగానీ, ఓ సన్నివేశం యాక్ట్‌ చేసి చూపించమనిగానీ అనకుండా మా సినిమాలో హీరోగా చేస్తావా అనడిగారు. హీరోగా అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అదే ‘జగమేమాయ’ చిత్రం. విషయం చెప్పి ఏం చేయమంటావ్‌ అని నా భార్యను అడిగా. ‘వెతుక్కుంటూ వచ్చిన అవకాశం కాబట్టి తప్పకుండా చేసిరండీ. పని అయిపోగానే మళ్లీ వ్యాపారాలు చూసుకోవాలి. ఏ సినిమా ఆఫీస్‌ దగ్గర ఆల్భమ్‌తో అవకాశం అడగొద్దు’ అని చెప్పి పంపింది. ఆ సినిమా రిలీజ్‌ అయింది. గిరిబాబుకి మంచి పేరొచ్చింది. నాకు అంతంత మాత్రమే పేరొచ్చింది. ఏడాదిపాటు ఖాళీగా ఉన్నా. ఆ టైమ్‌లోనే నా పేరు రాజబాబు కాస్త మురళీమోహన్‌గా మారింది. 
TDP MP Murali Mohan prays at Tirumala – Tirumala Updates

ఏడాది తర్వాత మళ్లీ హనుమాన్‌ ప్రసాద్‌గారి నుంచి ఫోన్‌ వచ్చింది. దాసరిగారి దర్శకత్వంలో రాజబాబు హీరోగా రూపొందుతున్న ‘తిరుపతి’ చిత్రమది. అందులో సెకెండ్‌ హీరోగా అవకాశం వచ్చింది. షూటింగ్‌లో దాసరిగారితో మంచి అనుబంధం ఏర్పడింది. మురళీ నిన్ను మంచి హీరోగా నిలబెడతా అని మాటిచ్చారు. అలాగే చేశారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘బాబు’లో శోభన్‌బాబుకి తండ్రి పాత్ర వేశా(ఫ్లాష్‌బ్యాక్‌లో). ఆ తర్వాత ‘జ్యోతి’, ‘కల్పన’, ‘ఆమె కథ’ ఇలా వరుసగా సినిమా అవకాశాలొచ్చాయి. 
                 
ఎన్టీఆర్‌ తమ్ముడనేవారు 
ఎన్టీఆర్‌గారు ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రం తీస్తున్నారు. మేకప్‌మెన్‌ పీతాంబరం ఆ సినిమాకు నిర్మాత. ఓ పాత్ర ఉందంటూ నన్ను ఎన్టీఆర్‌గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌గారిని మొదట చూసింది అప్పుడే. పల్లెటూరి నుంచి వచ్చినవాడిని కాబట్టి సమస్కారం పెట్టాలనే సంస్కారం కూడా లేదు. కానీ ఆయన్ని చూడగానే నమస్కారం పెట్టాలనుకున్నా. నాకు  తెలియకుండానే కాళ్ల మీద పడి దండం పెట్టేశాను. ‘బ్రదర్‌ రండీ. మీ గురించి విన్నాం. బాగా చేస్తున్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర ఉంది. బాగా చేయండని ఆశీర్వదించారు. ఆ సినిమా నాకు పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ అయింది. అప్పుడంతా మురళీమోహన్‌ అనడం మానేసి ఎన్టీఆర్‌          తమ్ముడనేవారు. 
వ్యాపారి బయటికొచ్చాడు...
సినిమాలు సక్సెస్‌ కావడం, మంచి అవకాశాలు దక్కడంతో నాలో వ్యాపారస్తుడు మళ్లీ బయటికొచ్చాడు. నచ్చిన సినిమాల్ని కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్‌ తీసుకునేవాడిని. ప్రొడ్యూసర్‌గా మారి ‘రాందండు’ సినిమా తీశా. అప్పటివరకూ మురళీచిత్ర ఉన్న బ్యానర్‌ పేరును జయభేరిగా మార్చి ‘వారాలబ్బాయి’ సినిమా తీశా. నాకు వందో చిత్రమది. సినిమా సూపర్‌హిట్టై బ్యానర్‌ ఎస్టాబ్లిష్‌ అయింది. జయభేరిలో 25 సినిమాలు తీశాం. అందులో 20 సినిమాలు హిట్‌. రెండు, మూడు ఏవరేజ్‌, రెండు అట్టర్‌ప్లాప్‌లు. 

పోటీకి తట్టుకున్నా
33 ఏళ్ల వయసులో నేను పరిశ్రమలోకి వచ్చా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్న సమయమది. శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు కాస్త డల్‌ అయిన టైమ్‌లో నాది మూడో స్థానం అనేంతగా అవకాశాలొచ్చాయి. మహా అయితే 50 ఏళ్ల వరకు యాక్ట్‌ చేయగలం. తర్వాత హీరోగా చెయ్యలేం. ఇంకో 17 ఏళ్లల్లో మాగ్జిమం సినిమాలు చెయ్యాలని రెండు షిప్టులు పని చేసేవాడిని. ఒక సంవత్సరం అయితే 28 సినిమాలు చేశా. 50 ఏళ్లు అయ్యాక నా మీద నేనే రివ్యూ చేసుకున్నా. ఇక చాల్లే అని జనం అనకముందే నాకు నేనే సెల్ఫ్‌ రిటైర్‌మెంట్‌ తీసుకున్నా. హీరోగా చెయ్యను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతానని ప్రకటించా. అదే నా దురదృష్టం. హీరో ఫాదర్‌ క్యారెక్టర్‌ వేస్తానంటే హీరోకు బ్రదర్‌లా ఉన్నావనేవారు.  ఇప్పటికీ అదే బాధ. 

శోభన్‌బాబే కారణం
ఓ రోజు శోభన్‌బాబు పిలిచి మురళీమోహన్‌ మీ సంపాదన మొత్తాన్ని ఏం చేస్తారు? ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారు అనడిగారు. షేరింగ్‌ పార్టనర్‌గా వ్యాపారం చేస్తున్నాను. సినిమాలు తీస్తున్నాను సార్‌ అనగానే ఆయనొక సలహా చెప్పారు. మీ డబ్బును ఎవరి చేతిలోనో పెట్టి వారు వ్యాపారం చేసి లాభాలు మీకు పంచిస్తారు అనుకుంటే మీకన్నా తెలివి తక్కువ వారెవ్వరూ ఉండరు. వాళ్లు తినగా మిగిలింది మీకిస్తారు అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ఆరు నెలల్లో దివాళ తీయడంతో నష్టపరిహారం చెల్లించాలంటూ నా మీద పడ్డారు.  ‘ఈ ప్రపంచంలో మూడు వంతులు నీరు, ఒక వంతు మాత్రమే భూమి ఉంది. ఉండగా జనం పెరుగుతారు తప్ప భూమి మాత్రం పెరగదు’ అని గీతోపదేశంలాంటి మాట చెప్పారు. ఆయన మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. అప్పుడు రియల్‌ఎస్టేట్‌ బిజినెస్‌ ప్రారంభించి భూములు కొనడం మొదలుపెట్టా. ఎటువంటి లిటికేషన్‌ లేకుండా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేశా. 

పిలిచి అవకాశం ఇచ్చారు
ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన కొన్నాళ్లకు టీడీపీకి పార్టీకి ప్రచార కర్తగా కార్యక్రమాలు నిర్వహించేవాడిని. ఎలక్షన్ల టైమ్‌లో ప్రచారం చేసేవాడిని. ఓసారి ఎన్టీఆర్‌గారి నుంచి పిలుపొచ్చింది. ‘బ్రదర్‌ మీకు రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడిగా సీట్‌ ఇస్తున్నాం. పోటీ చేయండి’ అనడిగారు. నేను షాక్‌ తిన్నా. వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పటికీ నేను సరిగ్గా సెటిల్‌ అవ్వలేదు. పిల్లలు చదువుకుంటున్నారు ఇవన్నీ ఆలోచించి కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే అందరూ వద్దన్నారు. అదే మాట అన్నగారికి చెప్పా. పిచ్చోడివా! పిలిచి అవకాశం ఇస్తుంటే వద్దంటారే అనడిగారు. మళ్లీ 2009లో చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. గతంలో సెటిల్‌ అవ్వలేదనీ, పిల్లల్లు చదువుకుంటున్నారనీ చెప్పావు. నీ బాధ్యతలు తీరిపోయాయి కదా. ఇప్పుడు పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చెయ్యి అన్నారు. రాజకీయాలకు నేను సరిపోనండీ. కుళ్లు అంతా ఇక్కడే ఉంటుంది. నేను ఇమడలేనని చెప్పా. ప్రజా సేవా చెయ్యాలనే తపన నాలో ఉంది. అందుకే 2006లో  నా పేర ట్రస్ట్‌ పెట్టి కొందరు పేద పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నా. ఆ తృప్తి చాలు సార్‌ అని సమాధానమిచ్చా. అందుకు ఆయనొక  మాటన్నారు. ‘మురళీ అందరూ ఇదే మాట చెబితే మేం ఎవరితో రాజకీయం చేయాలి? రౌడీలు, గుండాలు ఉంటే వాళ్లతో నేను ప్రభుత్వం ఎలా నడపాలి. కొంతమందైనా నీతినిజాయితీ ఉన్నవాళ్లు ఉంటే ప్రజా సేవ చేయగలం. నీలాంటివారు రావాలి అని నన్ను కన్వెన్స్‌ చేశారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తావ్‌ అనడిగారు. నేనేదీ కానీ రోజు ఎన్టీఆర్‌గారు రాజమండ్రి నుంచి పోటీ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడినుంచే పోటీ చేసి ఆ గెలుపుని ఆయన పాదాలకు అంకితమిస్తా అన్నాను. అక్కడ గెలిచి ఓడిపోయాను. పదవున్నా లేకపోయినా ఇక్కడే ఉండి ప్రజాసేవ చేస్తానన్నాను. 
జనాలు తెలుసుకున్నారు...
మొదటిసారి 2000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ ఐదేళ్లు అక్కడే ఉండి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. హెల్త్‌ క్యాంప్‌లు పెట్టా. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశా. మంచినేతను గెలిపించుకోలేకపోయాం అనే విషయాన్ని తెలుసుకుని ఈసారి లక్ష డెబ్బై ఐదువేల ఓట్లతో గెలిపించారు. నాతోపాటు నా ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. వాళ్లతో కలిసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టా. డిల్లీ నుంచి రూ.100 పంపిస్తే మధ్యలో వాళ్లు తినగా చేరవలసిన వ్యక్తి 25 రూపాయిలు మాత్రమే చేరుతుందని రాజీవ్‌గాంధీగారు అన్న మాట గుర్తొచ్చింది. మంజూరు అయిన ప్రతి రూపాయి ప్రజలకు చేరేలా చేశాను. ఈ రెండేళ్లల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టా. 
నాయకుడికి సహకరించాలి...
ఇవాళ్ల మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. కోరుకోకపోయినా అనైతికంగా విడదీశారు. భారతదేశంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న మన రాష్ట్రం విడిపోయాక 13, 14 స్థానానికి చేరుకుంది. మనకు రాజధాని లేదు. పరిశ్రమలు, ఉద్యోగాలు లేవు. ఇలాంటి స్థితిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఈ మాత్రమైనా నిలబడగలిగాం. నడిరోడ్డున నిలబడ్డ మనం అభివృద్ధి మార్గంలో వెళ్లాలంటే నాయకుడికి పూర్తిగా సహకరించాలి. విమర్శించే పార్టీలను కూడా నేనిదే కోరుకుంటున్నాను. మరో పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం భవిష్యత్తు బావుంటుంది.

దైవ భక్తి ఎక్కువే
చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిన మార్గంలోనే వెళ్తున్నా. పొద్దున్న నిద్రలేవగానే దేవుడిని చూడటం, పూజలు చేయడం అలవాటైంది. 32 ఏళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను. ఫిల్మ్‌నగర్‌ టెంపుల్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ.. వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి దారిలోనే నిజాయితీగా గుడికి సేవ చేస్తున్నాం. 
ఎవరికీ రాని అవకాశాలు...
సామాన్య వ్యక్తిగా కెరీర్‌ ప్రారంభించి నటుణ్ణి, నిర్మాతని, రాజకీయనాయకుడిని అయ్యానంటే అది భగవత్సంకల్పమే. ఎవరికీ రాని అవకాశాలు నాకొచ్చాయి. సినిమా పరిశ్రమలో అయినా, రాజకీయాల్లో అయినా అందరితోనూ కలివిడిగా ఉంటాను. మా పార్టీనే కాదు ఇతర పార్టీలవారితో కూడా కలిసుంటాను. 

సినిమాలకు దూరంకాను
నటన అనేది ఓ అదృష్టం. రాజకీయాల్లో వెళ్లిపోయాడు మురళీమోహన్‌ ఇక సినిమాలు చేయడని నిర్మాతలు నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. కెరీర్‌ బిగినింగ్‌లో వేషం ఇవ్వమని ఎవర్నీ అడగలేదు. కానీ ఇవాళ నిర్మాతల్ని అడుగుతున్నా. నటుడిగా కెరీర్‌ పొడిగించమంటున్నా. నా   మొదటి ప్రాధాన్యం నటనే. నటనకు, సినిమాలకు ఎప్పటికీ దూరంకాను. 

ఒకే గౌరవంతో...
నిర్మాత మంచి కోరే వ్యక్తుల్లో కృష్ణగారు ప్రథముడు. సినిమా ఫెయిల్‌ అయితే నిర్మాతని పిలిచి మరో సినిమా చేసుకోమని డేట్స్‌ ఇచ్చేవారు. ఫైనాన్సర్లకు నిర్మాత తరఫున భరోసాగా నిలిచేవారు. నేటితరం హీరోలు కృష్ణగారిని ఆదర్శంగా తీసుకోవాలి. నేనంటే చాలా గౌరవంగా ఉంటారు. కృష్ణగారు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్విస్తాను. ఆయనతోపాటు గిరిబాబు, మాదాల రంగారావు, మోహన్‌బాబు, రంగనాథ్‌ నాకు మంచి మిత్రులు. 
నిర్మాతని దెబ్బ తీస్తున్నాను
పోటీ కోసం ఇప్పుడు పారితోషికం పెంచేస్తున్నారు. సినిమా హిట్‌ అయితే హీరోకి లేదా దర్శకుడికి పేరొస్తుంది. నష్టం మాత్రం నిర్మాతే భరించాలి. ఈ పద్దతి మారాలి. సినిమా భారాన్ని మోసే నిర్మాతకు కష్టం వస్తే హీరో, దర్శకుడు సపోర్ట్‌గా ఉండాలి.  పరిశ్రమలో మార్పులు రావాలి. లేదంటి రానున్న కాలంలో నిర్మాతలు కరువైపోతారు. నిర్మాత చేతిలో కంట్రోల్‌ ఉన్నప్పుడు సినిమాలు తీస్తా. ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రూ.50వేలకు మించి పారితోషికం తీసుకోవద్దు అని నిబంధన పెట్టుకున్నారు కాబట్టే అప్పుడు బడ్జెట్‌లో సినిమాలొచ్చాయి. ఇప్పుడు అలా ఆలోచించే హీరోలే లేరు. 
                                                                                                                 Actor Murali Mohan leading in Rajamundry | Actor Murali Mohan ...
బాక్స్‌: 
1) ‘బతికినంత కాలం నటుడిగానే ఉండాలి. చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉండాలి. నటుడిగానే చనిపోవాలి’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు అంటుండేవారు. ఆ మాటని ఆయన అక్షరాల నెరవేర్చుకోగలిగారు. అంతటి వాడిని కాకపోయినా నా స్థాయిలో నేను కూడా చివరి క్షణం వరకూ నటించాలనుకుంటున్నాను. నాకు క్యారెక్టర్స్‌ ఇవ్వండి. నటుడిగా నిలబడతాను నిర్మాతలకు ఇదే నా విన్నపం. 

2) పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో నేను పరిశ్రమలో అడుగుపెట్టా. సో నాకు ఇక్కడ ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు లేవు. ఈయన మా ఆయన అని సిగ్గుపడే స్టేజ్‌ నా భార్యకు రాకూడదనీ, ఇతను మా తండ్రా అని సిగ్గు పడే పరిస్థితి నా బిడ్డలకు రాకూడదని నన్ను చూసి వాళ్లు గర్వపడాలనీ అనుకుని, పరిశ్రమలో ఉన్నంత కాలం తాగుడు, వ్యభిచారం, ప్రేమ, జూదానికి దూరంగా ఉండాలని ఆరోజు నిర్ణయించుకున్నా. 99 శాతం దానికే కట్టుబడి ఉన్నాను. 

3) ఓరోజు అక్కినేనిగారు సాయంత్రం ఏం తీసుకుంటావయ్యా అనడిగారు. నథింగ్‌ సార్‌ అన్నాను. ఈ వత్తిడిలో కాస్త రిలాక్స్‌ కోసం నైట్‌ వైన్‌గానీ, బ్రాందీ కానీ కొంచెం తీసుకో తప్పులేదనీ ఆయనే ఇంపోర్టెట్‌ బాటిల్‌ ఇచ్చారు. ఓ ఐదారు నెలలు ట్రై చేశా గానీ నా వల్ల కాలేదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం లైట్‌గా తీసుకుంటా. ఇంట్లో డ్రింక్‌ చేయడానికి ఇబ్బందిపడతా. 

4) మన ఇష్టాల్ని పిల్లల మీద రుద్దుకూడదు. అమ్మాయిని ఒక డాక్టర్‌కి ఇచ్చి పెళ్లి చేశా. అబ్బాయికి తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. తనకు ఇంట్రెస్ట్‌లేక వద్దన్నాడు. అమెరికా వెళ్లి ఎమ్‌బిఏ చదివాడు. తిరిగొచ్చాక మళ్లీ అడిగా. సినిమాలు నాకు ఇష్టం లేదు. ఇక్కడ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయగలం. కానీ ఫెయిల్యూర్‌ని తట్టుకోలేం అన్నాడు. అక్కడితో ఆ టాపిక్‌ వదిలేశా. తను బిజినెస్‌ చేస్తానన్నాడు. 

5) సినిమా వాళ్లందరూ అద్దాల మేడలో ఉంటారని బయటోళ్లు అనుకుంటారు. అవి అద్దాలు కావు భూతద్దాలు. మనం చిన్న తప్పు చేసినా దానికి పెద్దదిగా చూస్తారు అందుకే చెడు మార్గంలో వెళ్లకూడదు. ఎదుటివాడు ఈర్ష్య పడేలా మనం ఉంటాలి కానీ జాలి పడేలా ఉండకూడదు’’ అని దాసరిగారు చెప్పారు. అదే బాటలో నడిచాను. 

6) చెన్నైలో ఉండగా నేను, జయచిత్ర పెళ్లి చేసుకున్నామనీ, సుజాత, సరితలతో తిరుగుతున్నాననీ తమిళ పత్రికల్లో రాశారు. చాలా బాధపడ్డా అప్పుడు. విజయబాపినీడుగారు పిలిచి ఇదంతా పబ్లిసిటీ అనుకోవాలిగానీ బాధపడకూడదు అన్నారు. నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. 

7) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సుఖంగా ఉండేవాళ్లం ఎందుకు ఇందులోకి వచ్చాం రా..  బాబూ అని ఓసారి అనిపించింది. తర్వాతి రోజే ప్రజా సేవలో తృప్తి ఉందని గమనించా. నేను ఏ రంగంలోనూ ఫెయిల్‌ కాలేదు. నేను రిటైర్‌ కాను. చివరి క్షణం వరకూ పనిచెయ్యాలి. ఖాళీగా కూర్చుంటే లేనిపోని జబ్బులొస్తాయి. 
8) మనసు ప్రశాంతంగా ఉంచుకుంటా. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తా. సిస్టమేటిక్‌గా ఉంటే అన్ని సజావుగా జరుగుతాయి. ఇవే నా ఆరోగ్య రహస్యాలు

Comments

Popular posts from this blog

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం